

లెజెండరీ దర్శకుడు మణిరత్నం సినిమాలు అంటే ప్రేమ కథలు, అద్భుతమైన సంగీతం గుర్తుకు వస్తాయి. అయితే ఆయన తదుపరి సినిమా గురించి ఇటీవల ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారనే విషయం పై పెద్ద చర్చ జరిగింది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పని చేస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో ఏఆర్ రెహమాన్ అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అనుమానాలన్నీ తప్పని తేలింది. మణిరత్నం తన కొత్త రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం మళ్లీ తనకు నమ్మకమైన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను ఎంపిక చేశారు. 1992లో వచ్చిన ‘రోజా’ సినిమా నుంచి మొదలైన వీరి కలయిక మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతోంది. ఈ కొత్త చిత్రం వీరిద్దరి కలయికలో 19వ సినిమా కావడం విశేషం. ఈ కాంబినేషన్ అంటేనే చార్ట్‌బస్టర్ పాటలు వస్తాయనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన పాటను రెహమాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కథానాయికగా కనిపించనుంది. విజయ్ సేతుపతికి మణిరత్నంతో ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరూ ‘చెక్క చివంద వానమ్’ కోసం కలిసి పనిచేశారు. మణిరత్నంతో పని చేయడం గొప్ప అనుభవమని, ఆయన ఆలోచనలు వేగంగా ఉంటాయని విజయ్ సేతుపతి చెప్పారు.
సాయి పల్లవి సహజ నటనకు మణిరత్నం మేకింగ్ జోడైతే వెండితెర పై ప్రత్యేకమైన మ్యాజిక్ కనిపిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని మణిరత్నం సొంత బ్యానర్ ‘మద్రాస్ టాకీస్’ నిర్మిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మణిరత్నం విజువల్స్, రెహమాన్ సంగీతం, విజయ్ సేతుపతి–సాయి పల్లవి నటన కలిస్తే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!