

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు చెందిన వి మెగా పిక్చర్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ‘ది ఇండియా హౌస్’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా కనిపించనుంది. రామ్ వంశీ కృష్ణ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం యూరప్‌లోని ఈస్టోనియాలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సయీ మంజ్రేకర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ లుక్ ఒకటి లీక్ అయినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
లీకైన ఫొటోలో సయీ తెల్లటి షర్ట్, పొడవాటి ఎరుపు రంగు స్కర్ట్ ధరించి, చేతిలో మండుతున్న దివిటీ పట్టుకుని పోరాటానికి సిద్ధమైన విప్లవకారిణిగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నట్లుగా ఈ లుక్ సూచిస్తోంది. లండన్ నేపథ్యంగా భారతీయులు సాగించిన పోరాటం, చరిత్రలో అంతగా ప్రాచుర్యం పొందని ఒక ముఖ్యమైన ఘట్టం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సయీ పాత్ర ఆమె గత చిత్రాల్లోని పాత్రలకు భిన్నంగా, తీవ్రమైన భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దేశం కోసం పోరాడే బలమైన మహిళగా ఆమె నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!