

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ, విడాకుల తర్వాత తొలిసారిగా ఒకే వేదికపై కనిపించనుండగా నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారారు. 2020లో పెళ్లి చేసుకుని, గత ఏడాది ఫిబ్రవరి లో చట్టపరంగా విడిపోయిన ఈ జంట, త్వరలో ప్రారంభం కానున్న 'ది 50' అనే సరికొత్త రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సియాసత్ కథనం ప్రకారం, షో నిర్వాహకులు వీరిద్దరినీ సంప్రదించారని, ఇద్దరూ సానుకూలంగా చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే దీనిపై వారు ఇంకా అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనప్పటికీ, వీరిద్దరూ ఒకే షోలో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇద్దరూ అంగీకరిస్తే, విడిపోయిన తర్వాత వీరు స్క్రీన్ పంచుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. వ్యక్తిగత విభేదాలతో విడిపోయిన మాజీ భార్యాభర్తలు ఒకే చోట పోటీదారులుగా ఎలా ఉంటారనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది.
'ది 50' షో గురించి:
'ది 50' అనేది భారతీయ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇచ్చే రియాలిటీ షో. ప్రసిద్ధ ఫ్రెంచ్ సిరీస్ 'లెస్ సింక్వాంటే' ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో ఏకంగా 50 మంది కంటెస్టెంట్లు ఒకేసారి ఒక పెద్ద భవంతిలో (మహల్) నివసిస్తారు. బిగ్ బాస్ మాదిరిగా దీనికి నిర్దిష్టమైన నిబంధనలు ఉండవు. అంతా గందరగోళం, ఊహించని మలుపులతో షో సాగుతుంది. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో ఈ షో ప్రసారం కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!