

టాలీవుడ్ నిర్మాతలు అంటే రిజర్వ్ బ్యాంక్ లెక్క. ఇక్కడ ఇచ్చినంత రెమ్యూనిరేషన్లు సౌత్ లో మిగిలిన చోట్ల దొరకడం కష్టం. పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తరువాత కన్నడ, తమిళ నిర్మాతలు కూడా భారీ రెమ్యూనిరేషన్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళ నాట నిర్మాతలే కరువయ్యారు.
తెలుగులో ఉన్న కొద్దిమంది యాక్టివ్ నిర్మాతలు కూడా ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. కాంబినేషన్లు ఎంత బలంగా ఉన్నాయో, సినిమా గిట్టుబాటు అవుతుందో లేదో చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగులో కేవలం నాలుగు లేదా ఐదు మంది హీరోలే వంద కోట్ల రెమ్యూనిరేషన్ మార్క్‌ను తాకుతుంటే, తమిళంలో విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలు ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో అంత పెద్ద రెమ్యూనిరేషన్లు సాధారణంగా కనిపించవు. కానీ ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి మాత్రం ఇప్పుడు రూ.80 కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొత్త స్క్రిప్ట్‌తో ఎవరైనా ఆయనను సంప్రదిస్తే రూ.100 కోట్లు కూడా అడుగుతున్నారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆయన రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి మైత్రీ మూవీ మేకర్స్‌లో, మరోటి సితార ఎంటర్టైన్మెంట్స్లో. ఈ రెండు సినిమాలకు కలిపి ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల చొప్పున రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ‘కాంతారా’ భారీ హిట్‌తో పాన్ ఇండియా మార్కెట్ రావడమే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!