

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈరోజు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, అవసరమైతే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలు డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అర్హతలేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఖండిస్తూ, తమ సర్టిఫికెట్లను పరిశీలించాలని కోరుతున్నారు.
మరోవైపు, విజయవాడలో ప్రతిపాదించిన ర్యాలీ, ధర్నాకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో ఇప్పటికే అమల్లో ఉన్న బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30తో పాటు వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్ సమస్యలు, పోలీసు సిబ్బంది కొరత వంటి కారణాలను డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం డీఎస్సీ ఆరోపణలపై తమ నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో విజయవాడలోని శాప్ కార్యాలయం పరిసరాల్లో పోలీసు బందోబస్తు పెంచారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!