

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా, ఇమిగ్రేషన్ విధానాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన కొన్ని ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రద్దైన అపాయింట్‌మెంట్లకు భవిష్యత్తులో కొత్త తేదీలు కేటాయించే అవకాశం ఉంది.
అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఇది వీసా సేవలను శాశ్వతంగా నిలిపివేసే నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే అపాయింట్‌మెంట్లను సర్దుబాటు చేస్తున్నామని తెలిపింది. వీసా దరఖాస్తుదారులను ఒకే విధమైన ప్రమాణాలతో పరిశీలించడం, భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయడం ఈ శిక్షణలో భాగంగా ఉన్నట్లు సమాచారం. తాజా పరిణామంతో వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి మరింత ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!