

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్రంగా ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ ఐక్యతపై మరోసారి చర్చ మొదలైంది. యూకేలో భాగమైన స్కాట్‌లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ మరింత స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగపరమైన మార్పుల కోసం తమ డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాల ప్రతినిధులు తాజాగా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. తమ భవిష్యత్తు ఐరోపా సమాఖ్యతో మరింతగా ముడిపడి ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ మూడు ప్రాంతాలు యూకే నుంచి విడిపోతే.. ఇంగ్లాండ్ మాత్రమే యూనియన్‌లో మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే యూకే ప్రధాని కార్యాలయం మాత్రం దేశ ఐక్యతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
ఈ ‘బ్రేకప్’ డిమాండ్ల వెనుక మూడు ప్రాంతాలకు వేర్వేరు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. స్కాట్‌లాండ్‌లో బ్రెగ్జిట్‌పై వ్యతిరేకత బలంగా ఉంది. ఐరోపా సమాఖ్యతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంతో పాటు తమ ప్రాంతంలోని సహజ వనరులు, ముఖ్యంగా ఉత్తర సముద్రంలోని చమురు వనరులపై నిర్ణయాధికారం తమకే ఉండాలని కొందరు కోరుతున్నారు. నార్తర్న్ ఐర్లాండ్‌లోని కొంతమంది ప్రజలు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో ఏకీకరణను కోరుతున్నారు. బ్రెగ్జిట్ వల్ల వాణిజ్యం, ఐరోపా సమాఖ్యతో సంబంధాల విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని వారు భావిస్తున్నారు. ఇక వేల్స్ తమ చట్టాలను తామే రూపొందించుకోవడంతో పాటు వెల్ష్ భాష, ప్రత్యేక సంస్కృతిని మరింతగా కాపాడుకోవాలని కోరుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్లిన్ పర్యటన సందర్భంగా ఐర్లాండ్ ఏకీకరణపై చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. అయితే యూకే ఐక్యతకు గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ ముప్పు ఉందని తాము భావించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!