

రైతుల శ్రమను తగ్గించి ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విధానాలు ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉద్యాన విశ్వవిద్యాలయ కళాశాల వద్ద రూ.10 కోట్లతో నిర్మించనున్న పరిశోధన సముదాయానికి శంకుస్థాపన చేసి, విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల విచక్షణారహిత వినియోగం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో భారత వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 70 శాతానికిపైగా కూరగాయల కొరత ఉందని మంత్రి తెలిపారు. రైతులు ప్రత్యక్షంగా పరిశీలించి ఆధునిక పద్ధతులను నేర్చుకునేలా పరిశోధనా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని ఆదేశించారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆక్రమణలను తొలగించి ప్రహరీ నిర్మించాలని సూచించారు. కూరగాయలు, పూలు, ద్రాక్ష, ఔషధ, సుగంధ పంటలపై పరిశోధనలను సమన్వయం చేసేందుకు పరిశోధన సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్ బాషా, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!