

తమిళనాడులోని మధురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశం వివాదాస్పదంగా మారడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీపతూణ్ వద్ద దీపం వెలిగించే కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన మధురై వెళ్లాలని నిర్ణయించుకోగా, పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ మున్నాని సభ్యులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వివాదం మరింత ముదరకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
మరోవైపు తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం మరింత రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దీపం వెలిగింపు అంశంపై వివాదం నేపథ్యంలో మధురైలో పరిస్థితులను పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!