

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంక్షేమం కోసం తితిదే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన భక్తులకే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి, సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తూ ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం అందించనున్నారు. సెప్టెంబర్ 9న ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గత రెండు నెలల్లో తిరుమలలో సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు మంగళవారం రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి పాల్గొన్నారు. గత రెండు నెలల్లో తిరుమలలో మొత్తం 17 మంది భక్తులు మరణించగా, మిగిలిన కుటుంబాలకు కూడా త్వరలో పరిహారం అందజేస్తామని ఈవో వెల్లడించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. భక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రత్యేక బీమా పథకాన్ని రూపొందించేందుకు ఏడాదిన్నర పాటు కృషి చేసినట్లు తెలిపారు. ఈ పథకానికి సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో బీమా పరిహారాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పథకం దర్శన టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు నేరుగా తిరుమలకు వచ్చే వారికీ వర్తిస్తుంది. టికెట్లు ఉన్నవారి వివరాలు ఎల్ఐసీ డేటాబేస్‌లో నమోదు కాగా, టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి ప్రవేశించే సమయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సాంకేతిక వ్యవస్థ ద్వారా గుర్తించి బీమా పరిధిలోకి తీసుకొస్తారు. అంతేకాకుండా తిరుమలలో సేవలందించే శ్రీవారి సేవకులకు కూడా ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!