

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ టీటీడీ ఆధ్వర్యంలో కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆగస్టు 30న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం నిర్వహిస్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణం నిర్వహించనున్నారు. గోగర్భం డ్యామ్ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం చేపడతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్ణాహుతితో యాగ కార్యక్రమాలు ముగుస్తాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!