

తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన, ప్రతిపాదనల తయారీ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్), క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ సబ్ స్కీమ్ (సీఆర్‌జీఎస్‌ఎస్) మార్గదర్శకాలను అమలు చేయాలని పురపాలక శాఖ జీవో 952 జారీ చేసింది. ఈ పథకాల కింద ప్రతిపాదించే ప్రాజెక్టులకు సూత్రప్రాయ పరిపాలనా అనుమతులు ఇవ్వడానికి రెండు షరతులు విధించింది. రాష్ట్రస్థాయి హైపవర్ కమిటీ ప్రాజెక్టును ఆమోదించి కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. అలాగే, ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ఈ షరతులు నెరవేరిన తర్వాతే రాష్ట్ర మిషన్ డైరెక్టర్ అనుమతులు మంజూరు చేయవచ్చు. ప్రాజెక్టుల పరిశీలన కోసం రాష్ట్రస్థాయి సాంకేతిక, హైపవర్ కమిటీలను ఏర్పాటు చేయగా, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ పథకం కింద కేంద్రం మొత్తం రూ.లక్ష కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇందులో పట్టణ ప్రాజెక్టులకు రూ.90 వేల కోట్లు, ప్రాజెక్టుల రూపకల్పన, సామర్థ్య పెంపునకు రూ.5 వేల కోట్లు, క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ సబ్ స్కీమ్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించింది.
మరోవైపు, తెలంగాణలో సమగ్ర టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీని మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు పురపాలక శాఖ జీవో 950 జారీ చేసింది. 2020 నవంబర్ 3న జారీ చేసిన విధానాన్ని వర్తించే చట్టాలకు లోబడి కొనసాగించనున్నారు. అలాగే, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లకు ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నకిలీ దరఖాస్తులను అరికట్టడం, గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచడం ఈ నిర్ణయం లక్ష్యంగా పేర్కొంది. ఆధార్ లేని వారు పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా పురపాలక శాఖ అంగీకరించే ఇతర ఫొటో గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ పొందవచ్చు. ఈ చర్యల ద్వారా పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంతో పాటు, అనుమతుల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!