

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నదీ జలాల కేటాయింపుల విషయంలో ఈ బోర్డులు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదని సాగునీటి నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు తలెత్తకుండా సామరస్యపూర్వకంగా నీటిని పంపిణీ చేయడం, ప్రాజెక్టుల నిర్వహణలో సమన్వయం సాధించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యాలు. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించే విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించాల్సిన బోర్డులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పనితీరు, నీటి కేటాయింపులపై నిర్ణయాల్లో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండాలి. అయితే, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటినా కృష్ణా బోర్డు ఇంకా హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్లుగా ఉచిత భవనం, ఇతర సదుపాయాలు కావాలని బోర్డు అధికారులు కోరుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించి కార్యాలయ స్థలాన్ని చూపించినప్పటికీ, బోర్డు అమరావతికి తరలివెళ్లలేదని ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయ తరలింపులో జాప్యంతోపాటు నీటి కేటాయింపులపై సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం బోర్డు పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!