

వైద్య విద్యార్థి ఏళ్ల తరబడి పుస్తకాలు చదువుతూ వైద్య పరిజ్ఞానాన్ని సంపాదిస్తాడు. అయితే, వృత్తిలోకి ప్రవేశించిన వైద్యుడు రోగులతో ఎదురయ్యే అనుభవాల ద్వారా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటాడు. ముఖ్యంగా క్లిష్టమైన వైద్య పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే రకమైన అర్హతలు, వైద్య పరిజ్ఞానం ఉన్న ఇద్దరు వైద్యుల నిర్ణయాలు, స్పందనలు భిన్నంగా ఉండవచ్చు. ఒకరు వ్యాధిపైనే దృష్టి సారిస్తే, మరొకరు ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యత్యాసానికి కారణం కేవలం జ్ఞానం కాదు, వివేకం. ఒక కార్డియాలజిస్టుగా ఈ అంశంపై ఆలోచించినప్పుడు, వైద్యులు వాణిజ్య ప్రయోజనాల కంటే కరుణకు, చిరాకు కంటే సహనానికి, వ్యక్తిగత లాభం కంటే నైతిక బాధ్యతకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఏం చేయాలో పుస్తకాలు నేర్పగలవు. కానీ స్పష్టమైన సమాధానం లేని సందర్భాల్లో ఎలా స్పందించాలో అనుభవం నేర్పుతుంది.
మేధోపరమైన జ్ఞానానికి, అనుభవం ద్వారా పొందే అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భారతీయ తాత్త్విక సంప్రదాయాలు కూడా వివరిస్తాయి. జీవితంలోని అంతిమ సత్యాలను అర్థం చేసుకునే సందర్భంలో వ్యాకరణ పాండిత్యం, పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోవని ఆదిశంకరాచార్యులు ‘భజగోవిందం’లో గుర్తుచేస్తారు. దీని అర్థం అభ్యసనాన్ని నిరాకరించడం కాదు. సంపాదించిన జ్ఞానం వ్యక్తి ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుందా లేదా అనేదే ముఖ్యమని ఈ సందేశం సూచిస్తుంది. జనక మహారాజు, అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన సంభాషణ దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. అనేక తాత్త్విక చర్చల్లో పాల్గొనే పాండిత్యం ఉన్నప్పటికీ, జ్ఞానం, మోక్షం గురించి లోతైన అవగాహన కోసం జనకుడు అష్టావక్రుడి మార్గదర్శకత్వాన్ని కోరాడు. సత్యాన్ని మేధోపరంగా తెలుసుకోవడం, దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం వేర్వేరు అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఉపనిషత్తుల సంప్రదాయం ప్రకారం, అవిద్య అంటే అజ్ఞానం లేదా అపార్థం. ఇది మనల్ని, ప్రపంచాన్ని చూసే దృష్టిపై అనేక పొరలను ఏర్పరుస్తుంది. కోపం హానికరమని తెలిసినా కోప్పడటం, కరుణ గొప్పదని అర్థం చేసుకున్నా కఠినంగా ప్రవర్తించడం, వైరాగ్యం గురించి మాట్లాడుతూనే విషయాలపై గాఢమైన అనుబంధాన్ని కొనసాగించడం ఇందుకు ఉదాహరణలు.
మేధోపరమైన అవగాహనను ఆచరణాత్మక వివేకంగా మార్చడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానం అంతర్ముఖ పరిశీలనకు ప్రాధాన్యమిస్తూ, మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రతిచర్యలను ప్రభావితం చేసే అంశాలను గుర్తించేందుకు సహాయపడుతుంది. ధ్యానం, ప్రార్థన వంటి అభ్యాసాలు అంతర్గత ప్రతికూలతలను తగ్గించి, ఆవేశపూరిత ప్రతిస్పందనల నుంచి ఆలోచనాత్మక స్పందనల వైపు, గందరగోళం నుంచి స్పష్టత వైపు నడిపించగలవు. దీని ఉద్దేశం జీవితానికి దూరం కావడం కాదు; జీవితంలో మరింత అవగాహనతో భాగస్వాములు కావడం. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, అధునాతన వైద్య సాంకేతికత మానవ విజ్ఞాన పరిధులను విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ, మనం సంపాదించిన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనే ప్రశ్న ఇప్పటికీ ప్రాధాన్యం కలిగి ఉంది. విద్య లక్ష్యం సమాచారాన్ని పెంచడం మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించడం కూడా. జ్ఞాని నుంచి ధ్యానిగా మారే ప్రయాణం మేధోపరమైన అవగాహన నుంచి అంతర్గత అనుభవం వైపు సాగుతుంది. మనం నేర్చుకున్న విషయాల ఆధారంగా ఎంత వివేకంగా, కరుణతో జీవిస్తున్నామన్నదే జ్ఞానానికి నిజమైన కొలమానం. జ్ఞానం అంతర్గత అనుభవంగా మారి, కరుణ రూపంలో వ్యక్తమైనప్పుడు వైద్యం ఒక వృత్తిని మించి మానవాళికి సేవ చేసే ఉన్నతమైన మార్గంగా నిలుస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!