

కర్ణాటకలోని హుబ్బళ్లిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే పదునైన మాంజా దారం మెడకు చుట్టుకోవడంతో స్కూటర్‌పై వెళుతున్న 38 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. భారత్ నగర్‌కు చెందిన విద్య మంజునాథ్ గౌడ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన ఆమె, ఒంటిగంట సమయంలో తిరిగి విధులకు స్కూటర్‌పై బయలుదేరారు. శివశంకర కాలనీలో వెళుతుండగా ఆమె మెడకు గాలిపటం దారం చుట్టుకుంది. దారం పదునుగా ఉండటంతో గొంతు భాగంలో తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, మార్గమధ్యంలోనే విద్య ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే పదునైన మాంజా దారాల వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు కారణమైన మాంజా దారంతో గాలిపటం ఎగురవేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని హుబ్బళ్లి నగర పోలీసు కమిషనర్ భూషణ్ జి. బోరసె తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!