

హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్-65), హైదరాబాద్–బెంగళూరు (ఎన్‌హెచ్-44) జాతీయ రహదారులను ప్రతిపాదించిన ఆరు లేన్లకు బదులుగా ఎనిమిది లేన్లుగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల మూడో వారంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులు, భవిష్యత్‌లో పెరగనున్న వాహన రద్దీని వివరిస్తూ అధికారులు సిద్ధం చేసిన నివేదికను ఆయన కేంద్రానికి అందించనున్నారు.
ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ మధ్య ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ కారిడార్‌కు త్వరగా ఆమోదం ఇవ్వాలని, హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోరనున్నారు. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐకి బదిలీ చేసిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఎనిమిది లేన్ల హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో అభివృద్ధి చేస్తే భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలు తీర్చడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!