

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు సహా మొత్తం రూ.40 వేల కోట్ల బకాయిల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్లు, జూనియర్ అసిస్టెంట్ స్థాయి హోదా, సొంత మండలాల్లో నియామకాలకు అవకాశం కల్పించడం, జీవో 11ను రద్దు చేయడం వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. పలుచోట్ల పోలీసులు తమను అడ్డుకున్నారని, మహిళా ఉద్యోగులను బలవంతంగా తరలించారని వారు ఆరోపించారు.
మండుటెండలోనూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తున్న ఉద్యోగులపై ఆంక్షలు విధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారని, భోజనం, నీరు అందించకుండా, కనీస అవసరాలు తీర్చుకోనీయకుండా ఇబ్బందులకు గురిచేశారని ఉద్యోగులు ఆరోపించారు. సుమారు 70 మందిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!