

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బదిలీల వ్యవహారం వివాదానికి దారితీసింది. తనపై ఓ మహిళా అధ్యాపకురాలు చేసిన ఆరోపణలను విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ఖండించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న పరిపాలనా సంస్కరణలు, బదిలీల నేపథ్యంలో కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. పరిపాలనా సర్దుబాట్లలో భాగంగా నిజామాబాద్ జిల్లా రూరూర్‌లోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలిని సెప్టెంబర్ 11న నిబంధనల ప్రకారం హైదరాబాద్‌కు బదిలీ చేసినట్లు వివరించారు. ఆ బదిలీని వ్యతిరేకించే క్రమంలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
నవంబర్ 7న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మహిళా అధ్యాపకురాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జానయ్య పేర్కొన్నారు. తన 35 ఏళ్ల అధ్యాపక, పరిశోధన, పరిపాలనా జీవితంలో మహిళా సహోద్యోగుల పట్ల ఎప్పుడూ గౌరవంగా వ్యవహరించానని తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిష్టతో పాటు వీసీ పదవి గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు, సంబంధిత మహిళా అధ్యాపకురాలికి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు, కాల్ హిస్టరీలు సహా అందుబాటులో ఉన్న డిజిటల్ ఆధారాలను పరిశీలించాలని డీజీపీని కోరారు. ఆరోపణల వెనుక ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ఆధారాలను నిష్పాక్షికంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. ఈ వ్యవహారంలో ఇరువైపుల ఆరోపణలు, ప్రత్యారోపణలపై పోలీసుల దర్యాప్తులోనే నిజానిజాలు వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!