

ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలను అన్ని రంగాల్లో మరింత విస్తృతంగా వినియోగిస్తే భారత్ 10 శాతానికి పైగా ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగళూరులో శనివారం జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సదస్సు ‘సంగం-2026’లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అధిక వృద్ధి సాధించేందుకు అన్ని రంగాల్లో మరింత కృషి అవసరమని, తద్వారా ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా దేశ ప్రయాణం మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
ఏఐ, సెమీకండక్టర్ చిప్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్‌లో కీలక పెట్టుబడి అవకాశాలుగా మారనున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏఐ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కేవలం స్టాక్ మార్కెట్ లిస్టింగ్స్ ఆధారంగా అంచనా వేయలేమని పేర్కొంటూనే, ఎదుగుతున్న ఏఐ సంస్థలు భవిష్యత్‌లో లిస్టింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సంతను పాల్, బి. సాంబమూర్తి రచించిన ‘క్యాష్‌లెస్ నేషన్: హౌ యూపీఐ చేంజ్డ్ ఎవ్రీథింగ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!