

బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో చేసిన మార్పులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మార్పులకు న్యాయస్థానం ఆమోదం తెలిపిందంటూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనపై ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, బిహార్ SIRపై గతంలో తీర్పు వెలువరించిన సమయంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న కొత్త ఫారం-6 అందుబాటులో లేదని పేర్కొంది. ఆ ఫారంలోని మార్పులకు తాము ఆమోదం తెలపలేదని, వాటిపై ఇంకా న్యాయపరమైన నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మార్పులు ఎవరు చేశారో తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం రికార్డులను పరిశీలిస్తామని తెలిపింది.
సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో, ఫారం-6లోని డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించినట్లు పేర్కొన్న నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలను సవరించకుండానే ఫారంలో మార్పులు చేశారని, కోర్టు ఆమోదం ఉందంటూ తప్పుదారి పట్టించే ప్రకటన ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకున్న విధానంపైనా పిటిషన్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రికార్డులను సమర్పించాలని కోర్టు కోరగా, మార్పులకు బాధ్యులెవరో పరిశీలించనున్నట్లు తెలిపింది. ఫారం-6లో మార్పుల చట్టబద్ధత, వాటికి సంబంధించిన ఆరోపణలపై తదుపరి న్యాయపరమైన పరిశీలన జరగాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!