

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు గడువును పొడిగించాలని వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని 19 చోట్ల తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువును మొత్తంగా పొడిగించేందుకు లేదా వాయిదా వేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే, నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని ఇప్పటికే ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని, అవసరమైతే జిల్లా కలెక్టర్ వద్ద నామినేషన్లు సమర్పించే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంపై గురువారంలోపు నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది. కోర్టులను ఆశ్రయించడం మినహా ఇతర చోట్ల ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఈ నెల 27న నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!