

కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టుకు సంబంధించిన కేసులో దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించడాన్ని సహించబోమని స్పష్టం చేసినట్లు తెలిపింది. విద్యార్థుల ముసుగులో ఇతర శక్తులు ఆందోళనల్లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ, అక్కడ కొన్ని ప్రాంతాల్లో హింస, దోపిడీలు చోటుచేసుకున్న విషయాన్ని ఉదాహరణగా చూపింది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ఏ కార్యక్రమమైనా పోలీసుల ముందస్తు అనుమతితో నిర్వహించాలని, విద్యార్థుల ఆందోళనల్లోకి ఇతర శక్తులు చొరబడకుండా ప్రభుత్వాలు నియమాలు రూపొందిస్తాయని వ్యాఖ్యానించింది.
జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా ఉపయోగించకుండా డీనోటిఫై చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. బారికేడ్లను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఉంటుందని, వాటిని బలవంతంగా తొలగిస్తే పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందని పేర్కొంది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన కేసులో తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. వారి వయసులను ప్రస్తావిస్తూ, 32 ఏళ్ల అశుతోష్ జెన్-జీ తరానికి చెందినవారు కాదని వ్యాఖ్యానించింది. 1997 తర్వాత జన్మించినవారిని సాధారణంగా జెన్-జీగా పరిగణిస్తారని పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!