

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ దిల్లీలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేస్తూనే, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నిరసనలు, రాజకీయ విభేదాలు సహజమని పేర్కొన్నారు. అమెరికాలోనూ తరచూ నిరసనలు జరుగుతుంటాయని, ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం రాజకీయ చర్చలు, భిన్నాభిప్రాయాలకు సంకేతమని వ్యాఖ్యానించారు. దిల్లీలో యువత నిరసనలను అణచివేసేందుకు భారత ప్రభుత్వం అధిక బలప్రయోగం, ఏకపక్ష నిర్బంధాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన 20 మంది మానవ హక్కుల నిపుణులు విమర్శించిన నేపథ్యంలో రూబియో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కూడా వారు కోరారు.
మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించనున్నారు. భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేయగల భారత్ సామర్థ్యాన్ని ఆయన గతంలో ప్రశంసించారు. వెనెజువెలా చమురు విక్రయాలకు కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్న అమెరికాకు, భారత్‌లోని భారీ రిఫైనరీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడితే ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ చమురు శుద్ధి సామర్థ్యంపై అమెరికా ఆసక్తి పెరిగినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!