

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ విమానాశ్రయాల నిర్వహణ సంస్థ (ఏఏహెచ్ఎల్) మరో భారీ పెట్టుబడిని సమీకరించింది. 360 వన్ అసెట్ నుంచి రూ.2,790 కోట్లు (300 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించింది. తాజా పెట్టుబడితో సంస్థ మొత్తం వాటా మూలధన నిధుల సమీకరణ సుమారు 1.35 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ పెట్టుబడి నేపథ్యంలో అదానీ విమానాశ్రయాల నిర్వహణ సంస్థ విలువ సుమారు 18 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అంతకుముందు ఆల్ఫా వేవ్ గ్లోబల్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, టెమాసెక్, బ్లాక్‌రాక్ సంస్థల నిర్వహణలోని పెట్టుబడి నిధులతో కూడిన కన్సార్టియం నుంచి సంస్థ రూ.9,825 కోట్ల పెట్టుబడిని అందుకుంది.
ఈ రెండు పెట్టుబడి లావాదేవీలు పూర్తయిన తర్వాత సంబంధిత పెట్టుబడిదారులందరికీ కలిపి అదానీ విమానాశ్రయాల నిర్వహణ సంస్థలో సుమారు 7.01 శాతం వాటా ఉండనుంది. తాజా పెట్టుబడులను విమానాశ్రయాల ఆధునికీకరణ, అదానీ విమానాశ్రయ నగరాల అభివృద్ధి, ప్రయాణికులకు అందించే సేవలు, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నారు. ప్రస్తుతం ఏడాదికి సుమారు 9.6 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉన్న సంస్థ, భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 20 కోట్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడితో విమానయాన మౌలిక సదుపాయాల రంగంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేయాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!