

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అమలవుతున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన, రూ.3,050 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టును నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఇన్‌టేక్ బావులు, నీటి శుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి కీలక పనులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని, అవసరమైన అనుమతులను వేగంగా పొందాలని అధికారులకు ఆదేశించారు.
ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు పనుల పురోగతిని రాష్ట్ర కార్యాలయానికి నిరంతరం నివేదించాలని, త్వరలో తాను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 13.50 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.151 కోట్లకు పైగా వ్యయం చేసి, సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం భాజపా జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!