

సోమాలియా పుంట్‌ల్యాండ్ తీరంలో హైజాక్‌కు గురైన MT Honour 25 ఇంధన నౌకలో ఐదుగురు సిబ్బందిని సముద్రపు దొంగలు హతమార్చినట్లు పుంట్‌ల్యాండ్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక భారతీయ నావికుడు, ముగ్గురు పాకిస్థానీలు, ఒక మయన్మార్ జాతీయుడు ఉన్నారు. మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా.. ఏప్రిల్‌లో మొగదీషు వైపు వెళ్తున్న సమయంలో పైరేట్లు దీనిని హైజాక్ చేశారు. అనంతరం భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా 16 మంది అనుమానిత పైరేట్లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరో ఘటనలో టోగో జెండాతో ప్రయాణిస్తున్న MT Eureka ఇంధన నౌకను కూడా పుంట్‌ల్యాండ్ సముద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మేలో యెమెన్ సమీపంలో హైజాక్‌కు గురైన ఈ నౌకలో 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది ఈజిప్ట్ జాతీయులు, నలుగురు భారతీయులు ఉన్నారు. భద్రతా బలగాలు నౌక వద్దకు చేరుకోగానే పైరేట్లు తీర ప్రాంతానికి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం సిబ్బందిని సురక్షితంగా విడిపించి నౌకను స్వాధీనం చేసుకున్నారు. అయితే పైరేట్లు నౌకకు నిప్పంటించి, దానిని ధ్వంసం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!