

ప్రపంచ టెక్నాలజీ, స్టార్టప్ రంగానికి కేంద్రంగా ఉన్న అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మహిళల మధ్య రహస్యంగా ప్రచారంలో ఉన్న ఓ ప్రైవేట్ స్ప్రెడ్‌షీట్‌లో 100 మందికిపైగా వ్యక్తుల పేర్లు ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, టెక్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు చెందిన వ్యక్తులపై ఇందులో ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. మత్తుమందులు ఇవ్వడం, లైంగిక దాడి, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఇందులో ఉన్నట్లు కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోపణలు స్వతంత్రంగా ధ్రువీకరించబడలేదు.
ఈ రహస్య వ్యవస్థను ‘విస్పర్ నెట్‌వర్క్’గా పిలుస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా ఫిర్యాదు చేస్తే ఉద్యోగం, కెరీర్, పెట్టుబడి అవకాశాలపై ప్రభావం పడుతుందనే భయంతో కొందరు మహిళలు పరస్పరం హెచ్చరికలు పంచుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు కలిసి నివసించే ‘హ్యాకర్ హౌస్’ల్లోనూ, టెక్ పార్టీల్లోనూ కొన్ని ఘటనలు జరిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. స్ప్రెడ్‌షీట్ గురించి సమాచారం బయటకు వచ్చిన తర్వాత మరికొందరు మహిళలు తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో టెక్ రంగంలో భద్రత, జవాబుదారీతనం, లైంగిక వేధింపులపై ఫిర్యాదులను పరిష్కరించే సంస్థాగత విధానాలపై చర్చ మళ్లీ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!