

తెలుగు మాసాల్లో ఐదో మాసమైన శ్రావణ మాసాన్ని శుభాల మాసంగా, ఆధ్యాత్మికంగా విశిష్టమైన మాసంగా భావిస్తారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడితో పాటు వివిధ దేవతలను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ఈ మాసంలో ప్రత్యేకత. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాల్లో పలు వ్రతాలు, పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. శ్రావణ సోమవారాల్లో ఉపవాసాలు, శివాభిషేకాలు నిర్వహిస్తూ పరమేశ్వరుడిని పూజిస్తారు. శ్రావణ మంగళవారాల్లో నూతన వధువులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రావణ శనివారాల్లో కూడా శని భగవానుడి పూజతో పాటు వివిధ నోములు, వ్రతాలు ఆచరిస్తారు.
ఈ మాసంలో నాగపంచమి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీవారి తిరునక్షత్రం, సంకష్టహర చతుర్థి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలు వస్తాయి. శ్రావణ మాసం చివరలో వచ్చే అమావాస్యను కూడా కొందరు భక్తులు ప్రత్యేకంగా ఆచరిస్తారు. పోలాల అమావాస్య రోజున సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం పూజలు, వ్రతాలు నిర్వహించే సంప్రదాయం ఉంది.
శ్రావణ మాసం వచ్చిందంటే ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. మామిడి తోరణాలు, పసుపు కుంకుమలతో అలంకరణలు, సంప్రదాయ వస్త్రధారణలు, ముత్తైదువుల పేరంటాలు, లక్ష్మీదేవి పూజలు, శివకేశవుల ఆరాధనతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు సిరిసంపదలు, సౌభాగ్యం, విద్య, సంతానం, కీర్తి, కుటుంబ శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్మకం.
ముఖ్య గమనిక: పైన పేర్కొన్న వివరాలు సంప్రదాయ విశ్వాసాలు, శాస్త్రాలు, ఆచార వ్యవహారాల ఆధారంగా అందించబడినవి. వీటిలోని అన్ని అంశాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం, అవగాహనపై ఆధారపడి ఉంటుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!