

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కయాదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కథిర్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబరు 6 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఇంతకీ కథేంటంటే?
డ్యాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) తండ్రి కోరిక మేరకు వ్యాపారం చేస్తుంటాడు. అయితే అతడికి పని కంటే జూదం, బెట్టింగ్‌లపైనే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పులపాలవుతాడు. కొడుకును అప్పుల బాధ నుంచి గట్టెక్కించేందుకు తల్లి మెర్సీ (జయసుధ) తన దగ్గర దాచుకున్న డబ్బును కూడా ఇస్తుంది. అయినా డ్యాన్ బెట్టింగ్‌లో ఆ మొత్తాన్ని కోల్పోతాడు. డబ్బు తిరిగి తీసుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో అతడు తన కుడి చేతిని కోల్పోతాడు. వైద్యులు మరో వ్యక్తి చేతిని అమర్చడంతో అతడి జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఫిజియోథెరపిస్ట్ ఇషా (కయాదు లోహర్) పరిచయమైన తర్వాత కూడా డ్యాన్ కుడి చేయి అతడి నియంత్రణలో ఉండదు. అది తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఓ రోజు బెట్టింగ్ సెంటర్‌లో డేవిడ్ (మిస్కిన్) కనిపించగానే ఆ చేయి అతడిపై దాడికి ప్రయత్నిస్తుంది. అసలు ఆ చేయి ఎవరిది? దానికి ఉన్న ప్రత్యేక శక్తి ఏమిటి? డేవిడ్‌ను ఎందుకు చంపాలనుకుంటుంది? అనే ఆసక్తికర అంశాలతో కథ సాగుతుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!