

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్‌పై పర్వతారోహకులు, పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్ప్రింగర్ నేచర్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. 2023 నుంచి 2026 వరకు ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్ద వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిశీలించిన అధ్యయనం ప్రకారం.. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి బేస్‌క్యాంప్ పరిసరాల్లోని హిమనీనదాల్లో సుమారు 70 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉంది. పర్వతారోహణ సీజన్‌లో దాదాపు 50 రోజుల పాటు బేస్‌క్యాంప్ వేలాది మంది పర్వతారోహకులు, సహాయకులతో కిక్కిరిసిపోతోంది. ఒక్క సీజన్‌లోనే అక్కడ సుమారు 1,600 టెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.
బేస్‌క్యాంప్‌లో వంట, వేడి, రాత్రివేళల వెలుతురు కోసం భారీగా ఇంధనాన్ని వినియోగించడం కూడా మంచు కరగడానికి కారణమవుతోందని నివేదిక తెలిపింది. ఏటా సగటున 824 పోర్టబుల్ వంటగ్యాస్ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్, 5,130 లీటర్ల గ్యాసోలిన్ వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కార్యకలాపాల వల్ల ఉత్పత్తయ్యే వేడి కారణంగా ఒక్క సీజన్‌లో సుమారు 2,492 టన్నుల మంచు కరిగిపోతున్నట్లు అంచనా వేసింది. మరోవైపు పర్వతారోహకులు, సహాయకులు రోజుకు దాదాపు 6,000 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తున్నారని, ఇది కుంభూ హిమనీనదంలోకి చేరుతోందని తెలిపింది. సరుకు రవాణాకు ఉపయోగించే యాక్‌లు, ఇతర జంతువుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. వాటి మూత్రం వల్ల ఉత్పన్నమయ్యే వేడితో ఒక్క సీజన్‌లో మరో 154 టన్నుల మంచు కరిగిపోతున్నట్లు అధ్యయనం అంచనా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!