

భారాస ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు స్పీకర్ పదవిని మాత్రమే కాకుండా మొత్తం శాసనసభను, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేవిగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటన తెలంగాణకు చీకటి రోజని పేర్కొన్నారు. స్పీకర్ మాతృమూర్తిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి పెట్టారు. కాంగ్రెస్‌తోపాటు భాజపా, ఎంఐఎం, సీపీఐ సభ్యులు సైతం తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించిన సందర్భంగా మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్కలు తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాతా మధు వ్యాఖ్యలపై భారాస అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, ఆయనతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సభా సంప్రదాయాలు, స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. మరోవైపు, తాతా మధు వ్యాఖ్యలు బాధాకరమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ పేర్కొంటూ, ఈ అంశంపై శాసనసభ తీర్మానం చేసి శాసనమండలికి పంపుతామని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!