

యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లండన్ నుంచి సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రమా నందనను లుకౌట్ సర్కులర్ ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను విమానాశ్రయ పోలీసులకు అప్పగించగా, వారు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని రమా నందనకు ఆమె న్యాయవాదుల సమక్షంలో నోటీసులు అందజేశారు. గత ఏడాది నవంబరులో శివక్రాంతికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 318(1) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. ఇంగ్లండ్‌లో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారన్నది ఫిర్యాదులోని ఆరోపణ. ఈ కేసులో రమా నందనతో పాటు ఆమె భర్త మధుకర్, ఆయన తండ్రి మోహనరావును కూడా నిందితులుగా చేర్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!