

అమెరికా, దక్షిణ కొరియాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఉత్తర కొరియా తన నేవీలోకి మరో భారీ విధ్వంసక నౌకను చేర్చింది. తూర్పు తీరంలోని వాన్సాన్ ఓడరేవులో 5 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ‘కాంగ్ కొన్’ అనే అధునాతన యుద్ధనౌకను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె కిమ్ జూ ఏ కూడా పాల్గొన్నారు. ఈ నౌక తమ అణు ప్రతిస్పందన వ్యవస్థలో భాగంగా పనిచేస్తుందని కిమ్ ప్రకటించినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.
‘కాంగ్ కొన్’ ఉత్తర కొరియా నేవీలో చేరిన రెండో భారీ విధ్వంసక నౌకగా కేసీఎన్‌ఏ పేర్కొంది. దాదాపు మూడు నెలల క్రితం పశ్చిమ తీరంలో ‘చోయ్ హ్యోన్’ అనే తొలి విధ్వంసక నౌకను నేవీలోకి చేర్చింది. కొత్త యుద్ధనౌకను ప్రారంభించిన సందర్భంగా కిమ్ మాట్లాడుతూ సముద్రం, సముద్రగర్భంలో తమ సార్వభౌమాధికారాన్ని చాటుకునే సమయం వచ్చిందని అన్నారు. ప్రత్యర్థులు తమ చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘కాంగ్ కొన్’కు అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!