

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం, చోరీ చేసిన విరాళాల సొమ్ములో కొంత భాగాన్ని నిందితులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టడంతో పాటు వడ్డీ వ్యాపారానికి కూడా వినియోగించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు అనుకల్ప్ మిశ్రా ఇంట్లో సోదాలు నిర్వహించగా, అంతకుముందు లవ్‌కుష్ మిశ్రా, కరుణేష్ పాండే నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ముగ్గురు నిందితుల బంధువులకు చెందిన 30 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. సోదాల్లో నగదు, బంగారు ఆభరణాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం వివరాలను వెల్లడించలేదు.
నిందితులు తమ బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపి ఆర్థిక ట్రాన్సాక్షన్‌లను దాచిపెట్టే ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుకల్ప్ మిశ్రా పేరిట సుమారు రూ.6.7 లక్షలకు కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమికి సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేయగా, ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!