

దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కోళ్ల ధరల హెచ్చుతగ్గులు, మేత ఖర్చుల పెరుగుదల, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మేత పదార్థాల లభ్యతపై నెలకొన్న ఆందోళనలపై చర్చించేందుకు ప్రముఖ పౌల్ట్రీ సంఘాలు, పరిశ్రమ ప్రతినిధులు ఒక్కటయ్యారు. ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (AIPBA), పాన్ ఇండియా బ్రీడర్స్ అసోసియేషన్ (PIBCC), వివిధ రాష్ట్రాల పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. చికెన్ ధరల్లో మార్పులు, మొక్కజొన్న ధరల పెరుగుదల, మేత పదార్థాల సరఫరా వంటి అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ జోన్లకు చెందిన బ్రీడర్లు సమన్వయంతో పనిచేస్తూ లైవ్ చికెన్‌కు కిలోకు కనీసం రూ.110 ధరను ప్రామాణికంగా తీసుకోవాలని అంగీకరించారు. పండుగల సమయంలో వినియోగం తగ్గడం వంటి కాలానుగుణ కారణాలతో ఇటీవల ధరలు తగ్గాయని, ఈ మార్పులు తాత్కాలికమేనని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
పౌల్ట్రీ మేత ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు కోరారు. ముఖ్యంగా నాన్-జీఎంఓ మొక్కజొన్న దిగుమతులపై సుంకాల మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా అందుబాటులో ఉన్న సోయాబీన్‌ను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా మేత అవసరాలను తీర్చుకోవచ్చని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో మేత పదార్థాల సరఫరా, ధరల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు వచ్చే వారం చివర్లో న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు, విధాన నిర్ణేతలను కలవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో AIPBA చైర్మన్ బహదూర్ అలీ, PIBCC కన్వీనర్ వసంత్ కుమార్ శెట్టి, TPBA అధ్యక్షుడు డాక్టర్ ఏ. తిరుపతి రెడ్డి తదితర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. పౌల్ట్రీ రంగం స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!