

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో క్రీడా ప్రాంగణాలను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పించాలని సూచించారు. యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పోటీలను అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. తెలంగాణ సంప్రదాయ క్రీడ కర్రసామును ఆతిథ్య రాష్ట్ర కోటాలో చేర్చేందుకు వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని, క్రీడాకారులకు వసతి సహా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం ఏర్పాట్ల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఆరు నగరాల్లో 20 వేదికలపై 27 క్రీడా విభాగాల్లో పోటీలు, ఒక డెమో ఈవెంట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులతో పాటు సుమారు 2 వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం అందుబాటులోకి వచ్చిన వనరులను ఖేలో ఇండియా నిర్వహణకు కూడా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసర ఆడంబరాలకు దూరంగా ఉండాలని అన్నారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!