

మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ముందుగానే ఫ్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేశాడు. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన రైలు తొలుత 2 గంటలకు వస్తుందని సమాచారం ఇవ్వగా, చివరకు సాయంత్రం 5 గంటల వరకు ఆలస్యమైంది. కుటుంబ సభ్యులను రైలు ఎక్కించి తిరిగి వస్తున్న సమయంలో టీటీఈ అతడిని ఆపి ఫ్లాట్‌ఫాం టికెట్ చూపించమన్నారు. టికెట్ కేవలం రెండు గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, గడువు ముగిసినందున రూ.500 జరిమానా విధించారు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని అతడు ఎక్స్‌లో పంచుకోవడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది.
రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులు లేదా వారిని సాగనంపేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు స్టేషన్‌లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే జరిమానా విధించడం ఎంతవరకు సమంజసమని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే ఫ్లాట్‌ఫాం టికెట్‌కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందని, అది రైలు రాకపోకలతో సంబంధం లేకుండా వర్తిస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే శాఖకు చెందిన ‘రైల్వే సేవా’ స్పందిస్తూ, సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రైలు ఆలస్యం వంటి పరిస్థితుల్లో ఫ్లాట్‌ఫాం టికెట్ గడువు నిబంధనల అమలుపై చర్చ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!