

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘వార్త – అవయవ దానం: అపోహలు - వాస్తవాలు’ అనే అంశంపై మీడియా కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, అధిపతి, ఎస్‌వోటీటీవో (జీవన్‌దాన్) విభాగాధిపతి డాక్టర్ భూషణ్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవాల కొరతను తగ్గించేందుకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ అన్నారు.
మరణించిన వ్యక్తి మరొకరికి కొత్త జీవితాన్ని అందించగల గొప్ప కార్యమే అవయవదానమని డాక్టర్ భూషణ్ రాజు పేర్కొన్నారు. వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ అవయవాల కొరత ఇప్పటికీ ప్రధాన సవాలుగా ఉందన్నారు. మార్పిడి చేసిన అవయవాన్ని శరీరం తిరస్కరించకుండా మందులతో నియంత్రించడంతో పాటు, గ్రహీతను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడం మధ్య సమతుల్యత అవసరమని వివరించారు. దాత, గ్రహీతలకు వైద్యపరంగా సరిపోలకపోతే స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కీలకమైన మార్గమని తెలిపారు. అవయవదానంపై అపోహలను తొలగించడంలో, ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!