

వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బీ-ఫామ్ కేటాయించిన పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని చిన్నారెడ్డి బహిరంగంగా విమర్శించారని, తనపై కూడా అభ్యంతరకర, అనైతిక, పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని మేఘారెడ్డి ఆరోపించారు.

ఆగస్టు 16, 2026న గోపాల్‌పేట మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తుందని మేఘారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై కూడా చిన్నారెడ్డి విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఫిర్యాదుతో పాటు సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చిన్నారెడ్డిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీ వేణుగోపాల్‌ను మేఘారెడ్డి కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!