

స్టాక్ మార్కెట్‌లో అధిక రాబడుల పేరుతో మోసాలకు పాల్పడటంతో పాటు ఏపీకే ఫైళ్ల ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా ధర్మపురికి చెందిన కొలుసు శ్రీకాంత్, విజయవాడకు చెందిన సనపాల సాయి ప్రకాశ్ నాయుడిని కోవెలకుంట్ల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల ఎస్పీ సునీల్ షొరాన్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. 2024 డిసెంబరులో నంద్యాల జిల్లా సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మల్లికార్జునకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన నిందితులు. స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.22.80 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం నకిలీ యాప్‌లో ఆయన ఖాతాలో రూ.1.44 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే పన్నులు, ఇతర ఛార్జీల పేరుతో మరో రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరో కేసులో రేవనూరుకు చెందిన ఆటోడ్రైవర్ చరణ్‌రాజ్ ఎస్‌బీఐ ఖాతాలో ఉన్న రూ.5.24 లక్షలను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన సెల్‌ఫోన్‌కు ఏపీకే ఫైల్ పంపించి, దాన్ని ఓపెన్ చేయించిన వెంటనే ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టి వారి ఆచూకీ గుర్తించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!