

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు, రాజకీయ విభేదాలు, ప్రజల అభిప్రాయాల వ్యక్తీకరణ సహజమని పేర్కొన్నారు. అమెరికాలోనూ ప్రతిరోజూ నిరసనలు జరుగుతుంటాయని, ప్రజలు ఆందోళనలకు దిగడం రాజకీయ చర్చలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయనడానికి సంకేతమని వ్యాఖ్యానించారు. దిల్లీలో యువత నిరసనలను అణచివేసేందుకు భారత ప్రభుత్వం అధిక బలప్రయోగం చేస్తోందని, ఏకపక్షంగా నిర్బంధాలు చేపడుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన 20 మంది మానవ హక్కుల నిపుణులు ఇటీవల విమర్శించారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో రూబియో స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించనున్నారు. భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, దేశం రిఫైనింగ్ రంగంలో కీలక శక్తిగా ఎదిగిందని రూబియో గతంలో ప్రశంసించారు. వెనెజువెలా చమురును విక్రయించేందుకు అమెరికా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్న తరుణంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు, పశ్చిమాసియా ఘర్షణల కారణంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. చమురు శుద్ధిలో భారత సామర్థ్యం ఈ పరిస్థితుల్లో కీలకంగా మారవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!