

కర్ణాటకలో వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మైసూరు రాజభవనం ముందు నిర్వహించిన జంబూ సవారిలో పాల్గొని, అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు.
మైసూరు దసరా ఊరేగింపులో కన్నడ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటక రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మైసూరు దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ వేడుకలను రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి వీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథుల సమక్షంలో ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా సాగాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!