

కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో నిర్వహించే ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుక జ్వాలా తోరణం. ఈ పవిత్రమైన అగ్ని తోరణాన్ని దర్శించడం, దాని కింద నుంచి వెళ్లడం వల్ల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది నవంబర్ 24, మంగళవారం సూర్యాస్తమయం తర్వాత శివాలయాల్లో ఈ వేడుక నిర్వహించనున్నారు. జ్వాలా తోరణం వెనుక రెండు ప్రధాన పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
మొదటి కథ ప్రకారం, కార్తిక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురులను సంహరించాడు. విజయంతో కైలాసానికి చేరుకున్న శివుడికి దిష్టి తగలకుండా పార్వతీదేవి జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణ కథనం. మరో కథ క్షీరసాగర మథనంలో వెలువడిన హాలాహల విషానికి సంబంధించినది. లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో నిలుపుకున్న తర్వాత శివపార్వతులు మూడుసార్లు జ్వాలా తోరణం కింద నుంచి వెళ్లినట్లు చెబుతారు. ఈ వేడుకలో రెండు ఎత్తైన కర్రలకు అడ్డంగా మరో కర్రను కట్టి, దానికి ఎండుగడ్డిని చుట్టి నిప్పు పెడతారు. ముందుగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఆ తోరణం కింద నుంచి తీసుకెళ్తారు. ఆ తర్వాత భక్తులు కూడా దాని కింద నుంచి వెళ్తారు. ఇలా చేయడం వల్ల దోషాలు తొలగి, మంచి ఆరోగ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
గమనిక: ఈ కథనంలోని వివరాలు పురాణాలు, సంప్రదాయాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిలోని అన్ని అంశాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!