

అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆక్టన్‌లో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన తల్లి, 14 ఏళ్ల సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆగస్టు 11న జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిడిల్‌సెక్స్ జిల్లా అటార్నీ మారియన్ రయాన్ ప్రకారం, అర్జున్ తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్థ్ అరవింద్ (14) ఇంట్లో మృతిచెందారు. వారి మృతదేహాలపై స్పష్టమైన గాయాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. మరణాలకు ఖచ్చితమైన కారణం, విధానం నిర్ధారించేందుకు వైద్య పరీక్షల నివేదిక రావాల్సి ఉంది. దర్యాప్తులో అర్జున్ ఆన్‌లైన్‌లో కుటుంబ సభ్యులపై హింసకు సంబంధించిన కల్పిత కథలు, ఆలోచనల కోసం చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు అధికారులు గుర్తించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఆగస్టు 11 సాయంత్రం కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోవడంతో అర్జున్ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తులో సిద్ధార్థ్, బేస్‌మెంట్‌లో సుధా మృతదేహాలను గుర్తించారు. అప్పటికే అర్జున్ అక్కడి నుంచి తన తల్లి కారులో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కారును గుర్తించిన పోలీసులు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై రెండు హత్య కేసులతో పాటు దాడి, కుటుంబ సభ్యులపై దాడి, వాహనాన్ని అనధికారికంగా తీసుకెళ్లడం వంటి పలు అభియోగాలు నమోదయ్యాయి. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, మృతికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్య పరీక్షల నివేదిక నిర్ధారించాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!