

టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తన కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం యజమానులు స్పాన్సర్ చేసే వీసాలు, చట్టబద్ధ వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో కంపెనీ స్పాన్సర్ చేసే వర్క్ వీసాలపై ఆధారపడుతున్న వలస ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. అంతేకాకుండా అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు వారికి ఉన్న అవకాశాలు కూడా పరిమితం కానున్నాయి.
ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు అమెరికా వెలుపల నుంచి కంపెనీ కోసం పనిచేసే అవకాశాన్ని ఐబీఎం కల్పించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు అంగీకరించని వారు ఈ ఏడాది చివరిలోపు కంపెనీని వీడాల్సి ఉంటుంది. దీనిపై ఐబీఎం ప్రతినిధి స్పందిస్తూ.. గత కొన్నేళ్లుగా నైపుణ్య వీసా కార్యక్రమాల్లో కంపెనీ భాగస్వామ్యం తగ్గుతూ వస్తోందని తెలిపారు. అమెరికాలో నిపుణుల కొరతను తీర్చేందుకు హైస్కిల్డ్ వీసా కార్యక్రమాలకు ఐబీఎం మద్దతు ఇస్తోందని, అయితే స్థానికంగా నాణ్యమైన ఉద్యోగుల లభ్యత పెరగడం, క్లయింట్ల అవసరాలు మారడం వంటి కారణాలతో కన్సల్టింగ్ విభాగంలో వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌ను మరింత తగ్గించాలని నిర్ణయించినట్లు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!