

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఫార్మాట్‌లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా భారత్ ఈ మైలురాయిని అందుకుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 300వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఇప్పటివరకు 300 మ్యాచ్‌లు ఆడిన భారత్ 200 విజయాలు సాధించగా, 83 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో ఏడు మ్యాచ్‌లు టైగా ముగియగా, 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, 176 విజయాలతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 135, దక్షిణాఫ్రికా 129, ఇంగ్లండ్ 128, ఆస్ట్రేలియా 127 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఆదుకున్నారు. తిలక్ 26 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలవగా, నితీశ్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఏడో వికెట్‌కు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీ భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో టీమిండియా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!