

అమెరికా రూపొందించిన అత్యాధునిక ఐదో తరం ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పూర్‌లో నిర్వహించిన ‘తరంగ్ శక్తి-2026’ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా సిబ్బంది తమ ఎఫ్-35 యుద్ధ విమానాల వద్దకు భారత అధికారులను కూడా వెళ్లనివ్వరని, అయినప్పటికీ వాటిని భారత్‌కు విక్రయించే అంశంపై మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎఫ్-35 విమానాల కొనుగోలుకు సంబంధించి అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన అందలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమెరికా పసిఫిక్ వైమానిక దళాల కమాండర్ జనరల్ కెవిన్ ఆయన పక్కనే ఉండటం గమనార్హం.
ఇదే సమయంలో రష్యా తన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్‌యూ-57ను భారత్‌కు అందించేందుకు సిద్ధంగా ఉందని ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. అయితే, ఆ విమానాన్ని కొనుగోలు చేసే విషయంపై భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జోధ్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్ శక్తి-2026’ వైమానిక విన్యాసాల్లో భారత వైమానిక దళంతో పాటు మరో ఏడు దేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం అంతర్జాతీయ వైమానిక దళాల మధ్య సహకారం, సామర్థ్యాల ప్రదర్శనకు వేదికగా నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!