

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను సకాలంలో పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిరభ్యంతర పత్రాల (NOC) జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కోరారు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొందడంతో పాటు ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ముందుకు సాగేందుకు ఈ ఎన్‌ఓసీలు కీలకమని ఆయన తెలిపారు.
ఫేజ్-2లో ప్రతిపాదించిన ఏడు కారిడార్ల పరిధిలోని వివిధ శాఖల ప్రస్తుత, కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. హెచ్‌ఎంఆర్ఎల్ ఎండీ, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ అవసరాన్ని వివరించారు. 122.9 కిలోమీటర్ల ప్రతిపాదిత కారిడార్లలో భూసేకరణ, రైల్వే క్రాసింగ్‌లు, నాగోల్ వద్ద మూసీ నది సహా జలాశయాలను దాటడం, గ్యాస్ పైప్‌లైన్లు, విమానాశ్రయ పరిధిలో నిర్మాణాలకు సంబంధించిన అనుమతులపై చర్చించారు. ప్రాజెక్టు సజావుగా సాగేందుకు సంబంధిత శాఖలు వీలైనంత త్వరగా ఎన్‌ఓసీలు జారీ చేయాలని మెట్రో అధికారులు కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!