

రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి దాదాపు ఏడేళ్లు గడిచినా వాటి అమలు పూర్తికాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణ కిందికి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో మరిన్ని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని ప్రభుత్వానికి సూచించింది. సీసీ కెమెరాల ఏర్పాటుపై తాజా వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేశ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్.వి. సుమంత్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 12న బడ్జెట్ విడుదలైందని, అయితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధుల విడుదలకు కొత్త జీవో అవసరమని తెలిపారు. నిధులు అందిన వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. మరోవైపు, అవసరమైన నిధుల బడ్జెట్ ఆమోదానికి సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్ర దేవ్ కోర్టుకు వివరించారు. ఈ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, కోర్టుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!