

పోలీసు సేవల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేర పరిశోధన, ప్రజలకు సేవల అందజేతను మెరుగుపరిచేందుకు సీఐడీ రూపొందించిన ఏడు డిజిటల్ సేవలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసు సేవలను వినియోగించుకునే ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పిటిషన్ల పరిష్కారం, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్ సేవలపై ప్రజల స్పందనను ఈ కేంద్రం సేకరిస్తుంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న 35 భరోసా కేంద్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అనుసంధానించి ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. బాధితులకు అందించే కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం, పునరావాస సేవలకు సంబంధించిన వివరాలను ఈ వ్యవస్థలో నమోదు చేస్తారు. దీంతో కేసు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు వీలవుతుంది.
కాగితపు రిజిస్టర్ల స్థానంలో రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకురావడంతో 23 రకాల నివేదికలను పోలీసు సిబ్బంది పొందగలుగుతారు. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల సమాచారాన్ని పోలీసులకు సకాలంలో చేరవేసేందుకు జైలు మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థను ఇప్పటికే అమల్లో ఉన్న జైళ్ల నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించారు. నేర పరిశోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఐదు ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీలు) రూపొందించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డిజిటల్ సేవలతో పర్యవేక్షణ, సమన్వయం, పారదర్శకత మెరుగుపడటంతో పాటు పోలీసు సేవల సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేశ్ మురళీధర్ భగవత్, సీఐడీ డీజీ చారుసిన్హా, ఏడీజీ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!